సోదరి నివేదిత - Sister Niveditha

Vishwa Bhaarath
సోదరి నివేదిత - Sister Niveditha

 డా. నివేదితా రఘునాథ్ భిడే
నిజంగా శివుడిని అర్చించాలంటే మనం శివుడు కావాలి – శివో భూత్వా శివం యజేత్. అలాగే ఈ భరత భూమిని ఆరాధించేందుకు సోదరి నివేదిత తానే భారతమాత అయింది. భారతిని సంపూర్ణంగా అర్ధంచేసుకుంది.

 స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు తెలిసినవారు, స్నేహితులు ఎవరు లేరు. చేతిలో తగినంత డబ్బు కూడా లేదు. ఇక ఆయన ఎవరో కూడా అక్కడివారికి తెలియదు. హిందూధర్మ జ్ఞానం, అనుభవం మాత్రమే ఆయనకు ఉన్నాయి. 1893లో చికాగో సర్వమత సమ్మేళనంలో హిందూ ధర్మాన్ని గురించి చేసిన ఉపన్యాసం తరువాత ఆయకు గుర్తింపువచ్చింది. అనేకమంది శిష్యులు, అనుచరులు ఏర్పడ్డారు. ఆ తరువాత ఆయన భారత్ కు విశ్వవిఖ్యాతి పొందిన స్వామి గా తిరిగివచ్చారు. ఆయనతో పాటు అనేకమంది విదేశీ శిష్యులు కూడా వచ్చారు. ఈ విదేశీ అనుచరులు, పేరుప్రతిష్టలు భారతీయులపై మానసికమైన ఎంతో ప్రభావాన్ని చూపాయి. హిందూ ధర్మపు ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని వాళ్ళు తిరిగి గుర్తించడమేకాక వారిలో స్వాభిమానం కలిగింది. ఇలా స్వామి వివేకానంద హిందూ ధర్మపు గొప్పదనం తెలియజేస్తూ విదేశాలలో సాగించిన జైత్రయాత్రల సారాంశమే సోదరి నివేదిత.
     భారత దేశాన్ని పూర్తిగా దోచుకుని, అన్ని రకాలుగా పతనావస్థకు తెచ్చిన జాతిలోనే మార్గరేట్ నోబుల్ (నివేదిత పూర్వాశ్రమంలో పేరు) జన్మించింది. కానీ నివేదితగా ఆమె ఈ దేశాన్ని మనలాగానే  ప్రేమించింది, ఇక్కడ ప్రజలకు సేవ చేసింది, ఇక్కడి ఉన్నతమైన అధ్యాత్మిక సంప్రదాయాన్ని అనుసరించింది. భారతీయ జీవనంలో సర్వత్ర ఆమె సౌందర్యాన్ని దర్శించింది.
ఒక బ్రిటిష్ మహిళ భారతీయ జీవనపు సౌందర్యాన్ని, ప్రత్యేకతను ఎలా చూడగలిగింది? అందుకు ఆమె తనను తాను ఎంతో మార్చుకోవలసి వచ్చింది. వేదాంత సత్యం, సర్వత్ర నిండిఉన్న పరమాత్మను గురించి  తెలుసుకున్న తరువాత భారత్ కు రావాలని, అక్కడ ప్రజలకు సేవ చేయాలని ఆమె నిశ్చయించుకుంది. సన్యాస దీక్ష తీసుకుని `నివేదిత’(సమర్పింపబడినది)గా మారింది. పేరు మార్చుకున్నంత మాత్రాన అప్పటి వరకు మార్గరేట్ నోబుల్ గా ఏర్పరచుకున్న అభిప్రాయాలూ, భావాలు ఒక్కసారిగా మాయమైపోవు కదా. ఆమెకు ఉన్న ఈ అభిప్రాయాలూ, భావాలను స్వామి వివేకానంద తన మాటల్లో తీవ్రంగా ఖండించేవారు. కొత్త దేశంలో, ఇతరులెవరు తెలియని చోట స్వామీజీ మాత్రమే ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా తన అభిప్రాయాలను తీవ్రంగా తప్పుపడుతుంటే ఆమెకు ఎలా ఉండి ఉంటుంది? అప్పుడు ఆమె ఎంతో తీవ్రమైన భావోద్వేగాలకు గురయ్యేది. అయినా  ఒక్కసారి కూడా తాను గురువుగా అంగీకరించిన స్వామి వివేకానంద పైన కానీ, తాను నమ్మిన తత్వం పైన కానీ నివేదితకు సందేహం రాలేదు. తిరిగి వెళ్లిపోదామనే ఆలోచన రాలేదు. “నేను ఎప్పటికైనా నా గురువు చెపుతున్నదానిని అర్ధం చేసుకోగలనా’’ అన్నదే ఆమె ఆలోచన.  లక్ష్యశుద్ది, అవిశ్రాంతమైన కృషి ఆమెను పూర్తిగా మార్చివేశాయి. ఆమె భారతీయ జీవనంలో కలిసిపోయింది. పూర్తి సమర్పణ భావంతో భారతిని సేవించింది. శివుడిని నిజంగా కొలవాలంటే మనం శివుడు కావాలి – శివో భూత్వా శివం యజేత్. అలాగే నివేదిత భరత మాతలో ఏకమైంది. భారత దేశాన్ని పూర్తిగా అర్ధం చేసుకుంది. ఎన్ని దోషాలున్న భారతీయులను ప్రేమించింది.
సిస్టర్ నివేదితో స్వామి వివేకానంద చిత్రం
సిస్టర్ నివేదితో స్వామి వివేకానంద చిత్రం 

సంపూర్ణమైన మార్పు
భారతీయ ఆత్మ, తత్వాన్ని ఆకళింపుచేసుకునేందుకు నివేదిత తనను తాను మార్చుకున్న తీరు మెకాలే మానస పుత్రులైన భారతీయులకు పెద్ద పాఠం. బ్రిటిష్ వారసత్వం పట్ల ఎంతో గర్వాన్ని కలిగి ఉన్న ఒక మహిళ (భారత్ గురించి) తన దురభిప్రాయాలను, అపోహలను, పాశ్చాత్య ధోరణిని పూర్తిగా పక్కనపెట్టి భారతీయ సంస్కృతి, సమాజాన్ని అర్ధంచేసుకుని, భారత దేశపు భక్తురాలిగా, నిజమైన భారతీయురాలిగా మారగలిగిందంటే , అలా మనం ఎందుకు చేయలేము? మెకాలే మానసపుత్రులమైన మనం కూడా అలా మన అపోహలు, దురభిప్రాయాలను పూర్తిగా వదిలిపెట్టి నిజమైన భారతీయులుగా మారవచ్చును. భారతీయ తత్వాన్ని ఆమె అర్ధం చేసుకోగలిగినప్పుడు మనం మాత్రమే అందుకు అర్ధం చేసుకోలేము? ఎవరైనా తమ మాతృభూమికి సేవ చేయాలనుకుంటే తమను తాము మార్చుకోవాలి, భగవంతుని కృపను పొందాలి. సోదరి నివేదిత ఈ సమాజాన్ని సేవించాలనుకునేవారందరికి ఒక స్ఫూర్తి.
     సోదరి నివేదిత ఇక్కడి సమాజం, ప్రజలతో మమేకమయ్యింది. తాను అర్ధంచేసుకున్న, అనుభూతి చెందిన ఏకాత్మ భావన ఆమె జీవితం, చర్యలు, మాటలలో ప్రతిఫలించింది. నా దేశం, నా ప్రజలు అనే ఈ సమాజాన్ని సంబోధించింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలలో పనిచేసేందుకు వెళ్ళేవాళ్లు `ఈ సమాజం’, `ఇక్కడి ప్రజలు’ అనే మాటలు మాట్లాడుతుంటారు. వారిని `నాగరికులను చేయడానికి’, `అభివృద్ధి చేయడానికి’ అక్కడికి వెళ్ళమని చెపుతుంటారు. తమ అభిప్రాయాలూ, భావాలను సాధారణ జనంపై రుద్దెందుకు ప్రయత్నిస్తారు. తన విదేశీ శిష్యులు అలా వ్యవహరించకూడని స్వామి వివేకానంద అనుకున్నారు. భారత్ ఎలా ఉందో, ఎలాంటిదో అలాగే దానిని అంగీకరించగలగాలని, గౌరవించగలగాలని ఆయన భావించారు. భారత్ నుండి నేర్చుకోవాలని వాళ్ళకు చెప్పారు. వివేకానందుని ఈ సందేశాన్ని సోదరి నివేదిత ఎంతగా జీర్ణించుకున్నదంటే స్వతంత్ర్య సమరయోధుడు బిపిన్ చంద్ర పాల్ ఒకసారి “నివేదిత ఇక్కడకు బోధకురాలిగా రాలేదు, ఒక శిష్యురాలిగా, అన్వేషకురాలిగా వచ్చింది.  ఈ భారత దేశాన్ని మనం ప్రేమించినదానికంటే అధికంగా ఆమె ఇష్టపడింది’’ అని అన్నారు.
      వేదాంతాన్ని ఆకళింపుచేసుకున్న తరువాత సోదరి నివేదిత ఇలా రాయగలిగింది -“ప్రపంచంలో కనిపించే వివిధత్వం, దాని వెనుక ఉన్న ఏకత్వం ఒకే సత్యానికి చెందినవైతే అప్పుడు కేవలం వివిధ పూజా పద్దతులేకాదు, అన్ని రకాల పనులు, అన్ని సృజనాత్మక పద్దతులు కూడా సాక్షాత్కారానికి మార్గాలే. అప్పుడు ఇహము, పరము అనే తేడా ఏమి ఉండదు. పనిచేయడమే ప్రార్ధించడం అవుతుంది. త్యాగమే   విజయం అవుతుంది. అప్పుడు జీవితమే మతం.’’ ఇదీ స్వామి వివేకానంద ఆమెకు బోధించిన మార్గం. అందుకనే ఆయన గురించి ఇలా రాసింది -“ఈ తత్వమే స్వామి వివేకానందను అద్భుతమైన కర్మ ప్రబోధకుడిగా చేసింది. జ్ఞాన, భక్తి యోగాలను ఆయన బోధించారు. ఆయన ప్రకారం పని, అధ్యయనం, పొలం మొదలైన కర్మ క్షేత్రాలన్నీ భగవంతుని సాక్షాత్కారం పొందగలిగిన స్థానాలే. మానవ సేవకు, మాధవ సేవకు తేడా లేదు. నీతికి, ఆధ్యాత్మికతకు తేడా లేదు. ఈ మూల విశ్వాసం నుండే ఆయన చెప్పిన సకల విషయాలు వచ్చాయి.’’ ‘’కళలు, విజ్ఞాన శాస్త్రం, మతం ఒకే పరమ సత్యపు మూడు విభిన్న వ్యక్తీకరణలు. కానీ దీనిని అర్ధం చేసుకోవాలంటే మనకు అద్వైత సిద్దాంతం తెలియాలి.’’ నివేదితకు వేదాంతం అంటే ప్రత్యక్ష కార్య పద్దతి. అందుకనే ఆమె ఆధ్యాత్మికత వివిధ రంగాల్లో ఆమె నిర్వహించిన కార్యాల ద్వారా వ్యక్తమయింది.
     స్వామి వివేకానందలోని జాజ్వల్యమానమైన ఆదర్శం సోదరి నివేదితకు లభించింది. భారత దేశం పట్ల ఆమెకు గల ప్రేమాభిమానాలు ఎంత తీవ్రమైనవంటే యోగి అరవిందులు ఆమెను అగ్నిశిఖ అని అభివర్ణించారు. జాతీయ జీవనంలో ఆ అగ్ని స్పృశించని రంగం లేదు. భారత దేశపు అభ్యున్నతి, భారతీయ ఆత్మను జాగృతం చేయడం అనే రెండు లక్ష్యాలతోనే ఆమె పనిచేసింది.

నూతన విద్యా దృక్పధం
“విద్యారంగంలో పనిచేసే వారంతా స్వామి వివేకానందుని లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి’’ అని నివేదిత కోరుకుంది. అది ఎలా జరుగుతుందో ఆమె ఇలా వివరించింది -“పిల్లవాడికి మంచి చేయడంతో పాటు జన – దేశ – ధర్మాలకు మేలు చేసేదిగా ఉండాలని విద్యావేత్తలు గ్రహించాలి. ఈ ప్రధాన అంశం ఆధారంగా రూపొందిందిన విద్య, శిక్షణలో ఎలాంటి స్వార్ధభావన, బలహీనతకు ఆస్కారం ఉండదు. భారత దేశంలో విద్యను జాతీయం చేయడమేకాదు, జాతి నిర్మాణ కారకమైనదిగా తీర్చిదిద్దాల్సిఉంది. 
     మన పిల్లల మనసుల్లో జాతి, దేశం అనే భావాలను నింపాలి. వాళ్ళ ఆలోచన కుటుంబ పరిధిని దాటి విస్తరించాలి. భారత దేశం కోసం త్యాగాలు చేయగలగాలి. భక్తిపూర్వకంగా ఈ దేశాన్ని కొలవగలగాలి. ఈ దేశాన్ని అధ్యయనం చేయాలి. ఈ దేశమే లక్ష్యం కావాలి. భారతి కోసమే భారతం. ఇదే వారి ఊపిరి కావాలి.
    … మహాపురుషులు పుడతారన్నది తప్పు. అలాంటివాళ్లు పుట్టరు. తయారవుతారు. ఒక గొప్ప ఆలోచన నుండి రూపొందుతారు. సర్వమానవాళిలో హృదయాంతరాళాల్లో  నిండిఉన్నది త్యాగభావనే. దీనిని మించిన లోతైన భావన ఏది లేదు. ఈ విషయాన్ని గుర్తిద్దాం …దీనినే దేశం పట్ల ప్రేమగా మలుద్దాం…ఈ విశ్వం పదార్ధంతో ఏర్పడినది కాదు. మేధస్సువల్ల ఏర్పడినది. 700 మిలియన్ ప్రజల తీవ్రమైన ఆకాంక్షను అడ్డుకోగలిగిన శక్తి ఈ ప్రపంచంలో దేనికైనా ఉందా… అంతా తీవ్రమైన ఆకాంక్షను కలిగించడం ఎలా..అందుకు జాతీయ విద్యావిధానమే మార్గం. మన మహాపురుషుల జీవితాలు మనకు ఆదర్శం కావాలి. అవే మన ఆలోచన కావాలి. భారత దేశ చరిత్ర చుట్టూనే మిగిలిన చరిత్రలు తిరగాలి. ‘’ ఈ ఆలోచనలు, ఆదర్శాల ఆధారంగానే సోదరి నివేదిత ఆడపిల్లలకోసం పాఠశాల నిర్వహించింది. అందుకనే ఆ తరువాత రవీంద్రనాథ్ ఠాగోర్ శాంతినికేతన్ ప్రారంభించినప్పుడు అక్కడ ఉపాద్యాయురాళ్లుగా పనిచేసినవారు ఎక్కువగా సోదరి నివేదిత పాఠశాల పూర్వ విద్యార్ధులే కావడంలో ఆశ్చర్యం ఏమి లేదు.

భారతీయ మహిళ
భారతీయ మహిళ గుణగణాలు సోదరి నివేదితను ముగ్ధురాలిని చేశాయి. కలకత్తా వీధుల్లో తిరుగుతూ, పనిచేస్తున్నప్పుడు ఆమెకు ఎన్నో విషయాలు తెలిసాయి. వాటి గురించి ఆమె ఇలా అంటారు -“భారతీయ మహిళకు లభిస్తున్న శిక్షణ ఎలాంటిది? ఎంత ప్రత్యేకమైనది? ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి పద్దతి కనిపించదు. భారతీయ జీవనపు గొప్పదనం ఎందులోనైనా ఉన్నదంటే అది ప్రధానంగా సామాజిక వ్యవస్థలో మహిళలకు ఇచ్చిన గొప్ప స్థానంలో ఉంది. 
     భారతీయ మహిళలు అజ్ఞానులు, అణచివేయబడినవారని కొందరు అంటూ ఉంటారు. అలాంటివారందరికి ఒకటే సమాధానం – భారతీయ మహిళ ఎప్పుడు అణచివేతకు గురికాలేదు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఘోరాలు ఇక్కడ కంటే మిగతా దేశాలలో చాలా తీవ్రంగా, పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇక మహిళలకు ఇక్కడ లభిస్తున్న సామాజిక గుర్తింపు, సంతోషం, వారి ఉన్నతమైన వ్యక్తిత్వం భారతీయ జీవనపు అత్యంత విలువైన అంశాలు. ఇక ఇక్కడ మహిళలు అజ్ఞానులనే వాదన మరింత అర్ధరహితమైనది. ఆధునికుల దృష్టిలో వాళ్ళు అజ్ఞానులు కావచ్చును. ఎందుకంటే వారిలో కొద్దిమందే రాయగలరు, చదవగలరు. అంతమాత్రాన వారిని నిరక్షరకుక్షులు, అజ్ఞానులు అనగలమా? నిజంగానే వాళ్ళు అలాంటివారైతే మన తల్లులు, బామ్మలు తమ పిల్లలకు చెప్పే రామాయణ భారతాలు, పురాణ కధలు సాహిత్యం కాదా? కేవలం యూరోపియన్ నవలలు, స్ట్రాండ్ పత్రిక మాత్రమే సాహిత్యమా? అలాగని ఎవరైనా అనగలరా? వ్రాయగలగడమే సంస్కృతి కాదు. అది సంస్కృతిలో ఒక భాగం మాత్రమే. ఈ `అక్షరాస్యత’ యుగం ప్రారంభం కావడానికి చాలాకాలం ముందే గొప్ప సాహిత్యం వచ్చింది. భారతీయ జీవనంలో మహిళల పాత్ర గురించి తెలిసిన ఎవరైనా వారికి ఇళ్ళలో లభించే విద్య, గౌరవం, వారి సున్నితత్వం, శుభ్రత, పొదుపరితనం, మత శిక్షణ, సాంస్కృతిక సంస్కారాలు తప్పక గుర్తిస్తారు. ఆ మహిళలు ఒక్క ముక్క చదవలేకపోయిన, రాయలేకపోయినా వారిపై అజ్ఞానులు, అవిద్యావతులు అని విమర్శలు చేస్తున్న వారికంటే చాలా విద్యావంతులే. ‘’

జాతి పునర్ నిర్మాణానికి మార్గదర్శి
సోదరి నివేదిత రచనల్లో భారతీయ వివేకం, సంప్రదాయం కనిపిస్తాయి. భారత్ పట్ల ప్రగాఢమైన ప్రేమ, గౌరవం కనిపిస్తాయి. అలాగే ఆ రచనలు ఆమె చురుకైన బుద్ధికి, భాష నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తాయి. ఆమె వ్యక్తం చేసిన భావాలు ఎంత లోతైనవి, ప్రగాఢమైనవంటే వాటిని ఇతర భాషలలోకి అనువదించడం కష్టం. అందుకనే కాబోలు ఆమె చాలా రచనలు ఇప్పటికీ అనువదింపబడలేదు. ఆ సాహిత్యం చరిత్రాత్మకమైనదే కాదు జాతి నిర్మాణంలో మార్గదర్శకమైనది కూడా. ఉదాహరణకు, ఇతర జాతులతో పోలుస్తూ హిందూ జాతి సాగించిన యాత్ర, ప్రపంచానికి అందించిన జ్ఞానాన్ని గురించి ఇలా రాసింది – “నిజమైన జాతీయ భావం నింపుకున్నవారు, ఈ జాతి ఎదుర్కొంటున్న సమస్యల గురించి చింతించేవారికి ఒక ప్రశ్న ఎదురవుతుంది. అదేమిటంటే, ఈ జాతి గతంలో ఎప్పుడైనా ఇంత గొప్ప కలలు కన్నదా? ఇంత గొప్ప ఆలోచనలు చేసిందా? ఇంత సౌమ్యంగా, పవిత్రంగా ఉన్నదా? ఎలాంటి తప్పటడుగులు వేయకుండా కొత్త మార్గాలను అన్వేషించిందా? మొదలైన ఇలాంటి ప్రశ్నలన్నిటికి హిందువులు మాత్రమే `అవును’ అని గట్టిగా సమాధానం చెప్పగలరు.’’ ఆమె దాదాపు 20 పత్రికల్లో తరచూ వ్యాసాలు రాస్తూండేది. ఆ వ్యాసాలన్నిటి ప్రధాన విషయం ఎప్పుడూ `భారతదేశమే’. భారతీయురాలిగా ఆమె మారిన అద్భుత వైనం మాత్రమే కాదు, ఆమె జీవితాన్ని, రచనలను నేడు ఆంతా, ముఖ్యంగా ఆంగ్ల విద్యావంతులు, తప్పక అధ్యయనం చేయాలి. అప్పుడే మన దేశపు గొప్పదనం, ప్రత్యేకతలు అర్ధమవుతాయి.

పాశ్చాత్య అనుకరణ ఎందుకు?
ప్లేగు, వరదలు మొదలైన ఉత్పాతాలు కలిగినప్పుడు, స్వతంత్ర పోరాటంలో సోదరి నివేదిత సమాజంతో పాటు మమేకమై పనిచేశారు. జాతీయ జీవనపు అన్ని రంగాలలో సాంస్కృతిక విలువల పునర్ స్థాపన, జాతీయ భావాన్ని పెంపొందించడం కోసమే ఆమె పనిచేశారు. “భారత దేశపు జాతీయ కళ పుట్టుకే నా అత్యంత ప్రియమైన కల’’ అని ఆమె అన్నారు. విద్యార్థులు పాశ్చాత్య అంశాల ఆధారంగా కళాప్రదర్శనలు ఇవ్వడం ఆమె అంగీకరించలేదు. భారతదేశానికి ఇంత ప్రాచీనమైన, విస్తృతమైన కళా రూపాలు ఉండగా పాశ్చాత్య కళా రూపాలను అనుకరించడం, అక్కడి విషయాలను ప్రదర్శన అంశంగా తీసుకోవడం ఎందుకని ఆమె ప్రశ్నించేవారు. అబనీంద్రనాథ్ ఠాగోర్, నందలాల్ బోస్ వంటి యువ చిత్రకారులు భారతీయ అంశాలను తమ చిత్రాలకు ప్రధాన విషయాలుగా తీసుకునేట్లు ఆమె ప్రోత్సహించారు. బాగ్ బజార్ లో పురాతన ఇల్లు, పాడుపడిపోయిన దేవాలయాలలోని నిర్మాణ నైపుణ్యం, అందాన్ని ఆమె చూసేవారుకానీ ఈ దేశంలో పాశ్చాత్య శైలిలో అధునాతన భవనాల నిర్మాణాన్ని అంగీకరించేవారుకారు. శాస్త్ర విజ్ఞాన రంగంలో కూడా భారతీయులు చేయగలిగినది ఎంతో ఉందని ఆమె అనేవారు. డా. జగదీష్ చంద్ర బోస్ ఆవిష్కారాలు ప్రపంచానికి తెలియకుండా బ్రిటిష్ వాళ్ళు అడ్డుకున్నప్పుడు ఇలాంటి అడ్డంకులు లేకపోతే భారతీయ శాస్త్రవేత్తలు ఎంత ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలరని ఆమె భావించారు. డా. జగదీష్ చంద్ర బోస్ కు సహాయపడేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆవిష్కారాలను ప్రపంచానికి తెలియచెప్పడానికి ఆయన ఆరు పుస్తకాలు ప్రచురితమవడానికి సహాయసహకారాలు అందించారు. స్వయంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి జగదీష్ చంద్ర బోస్ కార్యానికి నిధుల కొరత లేకుండా చూశారు.
    విప్లవకారులు జైలుకి వెళ్లినప్పుడు, విదేశాలలో తలదాచుకున్నప్పుడు వారి కుటుంబాల పోషణ భారాన్ని ఆమె వహించారు. ఇలా ఆమె జాతీయ జీవనంలో అన్ని విషయాలలో తనవంతు పాత్ర నిర్వహించారు.

నిరాశ, నిస్పృహలకు ఆమె మనసులో స్థానం లేదు
అవసరమనుకున్నప్పుడు సోదరి నివేదిత రామకృష్ణ మిషన్ కు రాజీనామా చేసి స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల సందేశాలను ప్రచారం చేయడానికి రామకృష్ణ మిషన్ అవసరం. కానీ జాతీయ భావాన్ని పెంపొందించడం ద్వారా ప్రజలను స్వతంత్ర ఉద్యమానికి సమాయత్తం చేయడం అప్పటి తక్షణ అవసరం. కనుక సోదరి నివేదిత ఆ పనికి పూనుకున్నారు. రామకృష్ణ మిషన్ నుండి రాజీనామా చేసినా ఆ సంస్థతో ఆమె చివరివరకు సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. రామకృష్ణ – వివేకానంద భావ ఉద్యమంలో తాను కూడా ఒక భాగమని ఆమె చెప్పేవారు. ఎప్పుడు అనారోగ్యం బారిన పడిన రామకృష్ణ మిషన్ కు వెళ్ళేవారు. బుల్ అనే మహిళ తన అవసాన దశలో తన యావదాస్తిని సోదరి నివేదితకు దానం చేస్తే, ఆ ఆస్తిని నివేదిత రామకృష్ణా మిషన్ కు రాసిచ్చేశారు. అలాగే తన గ్రంధాలయాన్ని సోదరి క్రిస్టీన్ గ్రీన్ స్టీడెల్ నడుపుతున్న పాఠశాలకు ఇచ్చేశారు. ఆమె మనసులో నిరాశ, నిస్పృహ, అసంతృప్తి మొదలైన నకారాత్మక భావాలకు చోటులేదు. భారత దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరితో పనిచేశారు. కానీ దేశ ప్రయోజనాలకు ఉపయోగపడదని అనుకున్నప్పుడు కొందరికి దూరమయ్యారు కూడా. దేనికైనా దేశ ప్రయోజనమే గీటు రాయి.
ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు శ్రీ. హేమచంద్ర ఘోష్ స్వామి వివేకానంద, సోదరి నివేదితల గురించి తన జ్ఞాపకాలను స్వామి పూర్ణాత్మానందకు తెలియజేశారు. ఆ సంభాషణలు బెంగాలీ భాషలో పుస్తకంగా వెలువడ్డాయి. దానిని ప్రొ. కపిల చటర్జీ ఆంగ్లంలోకి అనువదించారు. 
      `ఐ యామ్ ఇండియా’ అనే శీర్షిక కలిగిన ఆ పుస్తకంలో హేమచంద్ర ఘోష్ ఇలా రాశారు -“స్వామి వివేకానంద ప్రజ్వలింపచేసిన దేశభక్తి భావనను సోదరి నివేదిత అందిపుచ్చుకున్నారన్నది నిజం. అంతేకాదు ఆమె ఆ జ్వాలను దేశంలోని నలుమూలలకు వ్యాపింప చేశారు. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళిన సోదరి నివేదిత తన స్పూర్తివంతమైన ప్రసంగాలు, నినాదాలతో స్వామీజీ ఆదర్శాలు, దేశభక్తి బావనను ప్రజలలో ప్రచారం చేసేవారు. దానితో పాటు సంస్కృతి, భారత దేశ వైభవం, ఆదర్శాలను కూడా ఆమె ప్రజలకు తెలియచెప్పేవారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం స్వామి వివేకానందకు సోదరి నివేదిత సన్నిహిత్యం వల్ల మరింత అబ్బిందని చెప్పవచ్చును. నేను స్వామీజీతో ఉన్నది చాలా తక్కువ కాలం. కానీ సోదరి నివేదితను ఎక్కువ కాలం చూసే భాగ్యం కలిగింది. ఆమె ద్వారా మనకు స్వామీజీ, అలాగే భారత దేశం మరింత బాగా అర్ధమవుతాయి. స్వామి వివేకానంద సందేశాన్ని ప్రచారం చేయడంలో సోదరి నివేదిత రెండు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఒకటి పరమశివుడు, రెండు, భగీరథుడు. ఝంఝామారుతం వంటి తీవ్రమైన స్వామీజీ సందేశాన్ని తనలో ఇముడ్చుకోవడమే కాక ఆ మహా ప్రవాహానికి భగీరథుడిలా ఒక దిశను చూపించింది.’’

సోదరి నివేదితతో శారద మాత
సోదరి నివేదితతో శారద మాత
భారతదేశంపట్ల అపరిమితమైన ప్రేమ
రాజకీయాలు, విద్య, కళలు, సాహిత్యం, సమాజ శాస్త్రం, ఆధ్యాత్మికత ఇలా అన్ని రంగాలలో సోదరి నివేదితకు భారతదేశం పట్ల ఉన్న అపారమైన ప్రేమాభిమానాలు ప్రకటితమయ్యాయి. ఆమెది బహుముఖీయమైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వం. ఆమె విప్లవకారిణి, అలాగే యోగిని కూడా. ఆమె విద్యావేత్త, కళా విమర్శకురాలు. రచయిత, ప్రజలకు సేవచేసిన సంఘసేవకురాలు. శారదా మాత పాదాలవద్ద కూర్చున్నప్పుడు ఆమె శిష్యురాలు. అలాగే రవీంద్రనాథ్ ఠాగోర్ వర్ణించినట్లు ఆమే లోకమాత, సోదరి  కూడా.   “ఓ నా భాగ్యమా! భోగభాగ్యాలు కోల్పోయి, వివేకం భ్రష్టమై, పతనమై, పరాజితమై, కలహాలు, కుత్సితాలలో కూరుకుపోయిన ఈ దేశ ప్రజానీకాన్ని ఎవరైనా సంపూర్ణమైన మనస్సుతో ప్రేమించగలిగితే అప్పుడు ఈ దేశం తిరిగి నిలబడుతుంది.’’ అని స్వామి వివేకానంద ఒకసారి అన్నారు. స్వామీజీ కోరుకున్న భాగ్యమే సోదరి నివేదిత. ఆమె భారతీయులను వారి దోషాలతోపాటు మనస్ఫూర్తిగా ప్రేమించింది. ఆమె 150వ జయంతి సందర్భంగా  ఆమె జీవితాన్ని, జీవన కార్యాన్ని అర్ధం చేసుకుందాం. ఆమెలాగానే మనమూ ఈ దేశాన్ని, ప్రజానీకాన్ని ప్రేమిద్దాం. భారత మాత కార్యం చేయడంలో సోదరి నివేదిత జీవితం మనకు స్ఫూర్తిని కలిగించుగాక.

ఆర్గనైజర్ సౌజన్యంతో…
(రచయిత వివేకానంద కేంద్ర ఉపాధ్యక్షులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత)

{full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top