ఖిలాఫత్ ఉద్యమం అందించిన పాఠాలు - Khilafat movement

Vishwa Bhaarath
ఖిలాఫత్ ఉద్యమం అందించిన పాఠాలు - Khilafat movement
ఖిలాఫత్ ఉద్యమం అందించిన పాఠాలు - Khilafat movement

– డా. శ్రీరంగ గోడ్బోలే
4 ఫిబ్రవరి1922న చౌరీచౌరాలో జరిగిన మారణహోమానికి మనస్తాపం చెంది గాంధీగారు ఉన్నట్టుండి సహాయ-నిరాకరణోద్యమాన్ని రద్దు చేసారు. అయితే ఖిలాఫత్ ఉద్యామానికి సహాయనిరాకరణ కేవలం ఒక ముసుగు మాత్రమే. ఖిలాఫత్ ఆశించిన లక్ష్యాలు ఇంకా సాధించలేదు కాబట్టి, అది సహాయనిరాకరణ అనే ఆచ్చాదన, అడ్డంకు ఏమీ లేకుండా నిరాటంకంగా కొనసాగింది. ఖిలాఫత్ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు, వారనుకున్న నాలుగు లక్ష్యాలు ఒకసారి గుర్తు చేసుకుందాం: స్వేచ్చాయుతమైన టర్కీ సామ్రాజ్యం, ఆగ్నేయ యూరోప్ నుంచి టర్కీ దాకా పాత `త్రేస్ ప్రాంతా’న్ని పునరుద్ధరించడం, స్మిర్ణా( ఇప్పటి ఇజ్మీర్) మరియు ఆసియా మైనర్ తీరం (ఇప్పటి అనటోలియా లేక ఆసియా ప్రాంత టర్కీ)నుంచి టర్కీ దాకా పునరుద్ధరణ, జజీరత్-ఉల్-అరబ్ ప్రాంత (ఇస్లాం పవిత్ర స్థలాలున్న అరేబియా ద్వీపకల్పం (పెనిన్సులా) స్వేచ్ఛ భద్రతలు.

ఖిలాఫత్ సమాప్తి
టర్కీ, మిత్రపక్షాల మధ్య జరిగిన  లాసాన్న్ ఒప్పందం (24 జూలై 1925)ప్రకారం, టర్కీకి  కాన్సాన్టిన్ నోపుల్, త్రేస్ పట్టణాలనుంచి, టర్కిష్ స్ట్రెయిట్స్ తో సహా, మెరిత్జా వరకుగల  ప్రాంత నియంత్రణ చేకూరింది. ఒప్పందం ప్రకారం టర్కీ తన సామ్రాజ్యాన్ని కోల్పోయినా, పశ్చిమాసియా ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని తిరిగిపొంది, కొనసాగిస్తూవచ్చింది. ఒప్పందంలోని మొదటి మూడు ముఖ్య ఫలితాలు టర్కీ సాధించినా, ఇస్లాం మతప్రాతిపదిక కోణంనుంచి, వారికి నాలుగో లక్ష్యమైన `ఖలిఫేట్’ను స్థాపించడం అతిముఖ్యం. ఖలిఫేట్ వాదులు ఉద్యమాన్ని కొనసాగిస్తామని నిశ్చయించుకుని, మొదట్లో `ముస్తఫా కెమాల్’ ప్రభుత్వాన్ని సమర్థించారు కూడా. అయితే కాలంచెల్లిన, విపరీత భావజాలమున్న ‘ఖలిఫేట్’ వ్యవస్థ, కొత్తగా ఏర్పడిన `టర్కిష్ రిపబ్లిక్’/గణతంత్ర దేశానికి తలనెప్పిగా, భవిష్యత్తులో ప్రమాదికారిగా మారుతుందని తలచిన ముస్తఫా కెమాల్, ఏకంగా ‘ఖలిఫేట్’ను రద్దుచేస్తాడని, ఖలిఫేట్ వాదులు ఊహించలేదు. అయితే కెమాల్ ప్రభుత్వం, గతంలోలాగా టర్కీ దేశానికి సైన్యాధిపత్యం లేదని, ఇస్లాంను రక్షించే గుత్తాధిపత్యం బాధ్యత కూడా లేవని కెమాల్ వాదించారు.


3మార్చ్ 1924న ఖలిఫేట్ రద్దు చేయబడింది, ఖలీఫా(రాజు)ను గద్దె దింపడం జరిగింది. టర్కీ జాతీయ ఉద్యమకారులు ఖలీఫాను అన్ని రకాల ఘోర అవమానాలకి గురిచేసారు, గద్దె దించిన కొన్ని గంటలలోనే రాజకుటుంబాన్ని టర్కీ నుంచి బహిష్కరించి దేశం వదిలి పొమ్మన్నారు. ఖలీఫ్ పాస్పోర్టులో  `అబ్దుల్ మేజిద్ అబ్దుల్ అజీజ్’ అనే పేరు మాత్రమే ఇచ్చి, ఆయనను దౌత్యపరమైన గౌరవమర్యాదలతో చూడక్ఖర్లేదని, ఇటలీ ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేసారు. శుక్రవారపు మసీదు ప్రార్థనలలో ఖలీఫ పేరును తొలగించిన జాతీయవాదులు, దాని బదులు `టర్కీ గణతంత్రo’ అని చేర్చారు. అలా తొలగించబడ్డ ఖలీఫ్, హైదరాబాద్ నిజాము ఏర్పాటు చేసిన గౌరవ వేతనం, కొందరు భారతీయ నవాబులు ఇచ్చిన విరాళాలు, `రెడ్ క్రెసెoట్ సొసైటీ’ నిధులతో తన శేష జీవితం గడిపాడు (The Khilafat Movement in India, 1919-1924, Muhammad Naeem Qureshi, dissertation submitted to University of London, 1973, pp.269-271, 276).

ఖిలాఫత్ ఉద్యమం అంతం
టర్కీ పరిణామాలతో నిర్ఘాంతపోయిన ఖిలాఫత్-వాదులు తమ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం మానలేదు. ఖలీఫాను తొలగించిన టర్కీ అధ్యక్షుడు `ముస్తఫా కెమాల్’ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకోవాలని, మౌలానా ఆజాద్ ప్రతిపాదించారు. ఆలస్యంగా నిద్రలేచిన ఖిలాఫత్-వాదుల అంతర్గత వైరుధ్యాలు బయటపడసాగాయి. సహాయనిరాకరణ, విధానపరిషత్ లలో ప్రవేశించడంపై భేదాలు మొదలయ్యాయి. పరిషత్ లో ప్రవేశంపై సికేసి వ్యతిరేక విధానం, జమీయత్-ఉల్-ఉలామా ఫత్వాలను కాదని, ఖిలాఫత్-వాదులు- మౌలానా అబ్దుల్ బారీ, అజ్మల్ ఖాన్, పరిషద్ ప్రవేశంపై అనుకూలత చూపించారు. ఇంకొందరు ఖిలాఫత్-వాదులు కాంగ్రెస్ పార్టీ సహాయనిరాకరణ కార్యక్రమానికి తాము తల ఒగ్గాల్సివస్తోంది అని చింతించారు, వీరికి బ్రిటిష్ వారిపై ప్రతిఘటన కేవలం ఒక కంటితుడుపు చర్య మాత్రమే; అసలు పోరాటమంతా, టర్కీ సంఘటనలపై ఆధారపడి ఉంటుంది.  మౌలానా అబ్దుల్ బారీ, కిద్వాయ్ వంటి ఖిలాఫత్-వాదులకి బ్రిటిష్ ప్రభుత్వం, టర్కీపట్ల సానుకూలంగా ఉందని ఎప్పుడైతే అనిపించిందో, అప్పుడు వారు ఫిబ్రవరి 1922లో      బ్రిటిషువారితో సర్దుబాటు చేసుకోవడానికి ముందుకొచ్చారు. కాని మరికొంతమంది మాత్రం బ్రిటిష్ ప్రభుత్వం టర్కీకి కావలసినంత సహాయం చేయట్లేదు అని అసంతృప్తిగా ఉండేవారు.


అహింసా సూత్రానికి కట్టుబడి ఉన్నామని మాటవరసకి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండేది. 1922తర్వాత విపరీతంగా జరిగిన అల్లర్లు, హిందూ-ముస్లిం ఐక్యత అనే ముసుగును తొలగించేసాయి. 1924 జూలైలో ఢిల్లీలో బక్రీద్ అల్లర్లు, నాగపూర్లో అల్లర్లు, ఆగస్ట్ లో పానిపట్లో అల్లర్లు జరిగాయి.  ఆ తరువాత, లాహోర్, లక్నో, మురాదాబాద్, భాగల్పూర్, రూర్కీ, ఆగ్రా, హన్పార్, జాంపూర్, మీరట్, అహ్మదాబాద్, పిలిభిట్, షాజెహానాపుర్, హర్దోయ్, కల్పి, అలహాబాద్, ఝాంగ్, నిజాం రాజ్యంలో ఉన్న గుల్బర్గాతో సహా ఎన్నో అల్లర్లు జరిగాయి. డిసెంబర్ 1923లో శుద్ధి ఉద్యమ నిర్మాత, ఆర్యసమాజ్ నేత శ్రీ స్వామి శ్రద్ధానంద దారుణ హత్య హిందువులను కలచివేసి, వారిని ఎంతో ఆందోళనకు, ఆగ్రహానికి గురిచేసింది.
     అదే సమయంలో, లక్షలాది రూపాయల ఖిలాఫత్ నిధుల దుర్వినియోగం చేయబడ్డాయనే నిజాలు వెల్లడి కావడంతో, ఖిలాఫత్ నాయకుల పైన ప్రజల్లో నమ్మకం పోయింది. సికెసి–కేంద్ర ఖిలాఫత్ కమిటి(CKC)లో, ఇతర రాష్ట్రాల్లో, నిధులు మళ్ళించారనే పుకార్లు చెలరేగాయి. ఒక్క పంజాబ్ లోనే రూ.40000-50000 దారిమళ్ళాయని  తెలిసింది. కోశాధికారి దగ్గర మిగిలిన రూ.16 లక్షల ఖిలాఫత్ నిధి, అతని ప్రైవేటు సంస్థకి దారి మళ్ళించడం జరిగింది. ఈ పరిణామాలతో ఖిలాఫత్ నిధికి విరాళాలు పడిపోయాయి.
    ఖిలాఫత్ ఉద్యమం ఆఖరి దశ మరింత దిగజారిపోయింది- గొడవలు, అవినీతి, వివిధ వర్గాల మధ్య పోట్లాటలు, వ్యక్తిగత గొడవలు, హిందూ-ముస్లింల విభేదాలు పెరిగిపోయాయి. 1929 తరువాత  సికెసి–కేంద్ర ఖిలాఫత్ కమిటి ఉన్నా, ఎటువంటి సమావేశo జరగలేదు. అనైక్యత కారణంగా ఖిలాఫత్-వాదులంతా ముక్కలుముక్కలుగా విడిపోయి చిన్నచిన్న గుంపులుగా అయిపోయారు. జాతీయవాద ముస్లింలు అని పిలవబడే కొందరు- అన్సారీ, ఆజాద్, డా.మహమూద్, షేర్వాని, కిద్వాయ్, అసఫ్అలీ, అక్రం ఖాన్, కిత్చ్లూ, డా.ఆలం, ఖలికుజ్జామన్ మొ.వారు `ముస్లిం జాతీయ పార్టీ’గా రూపాంతరం చేసుకున్నారు. అలీ సోదరులు, హజ్రత్ మోహాని, ఆజాద్ సుభాని మొ.వారు `ముస్లిం లీగ్’కి అనుబంధంగా `అఖిల భారత జాతీయ ముస్లిం కాన్ఫరెన్స్’ స్థాపించుకున్నారు. అబ్దుల్ బారీ, అజ్మల్ ఖాన్, డా.అన్సారీ, అలీ సోదరులు వంటి నాయకులు 1926తరువాత కాలంలో మరణించారు. ముక్కలైపోయిన ఖిలాఫత్ ఉద్యమం 1938నాటికి పూర్తిగా కనుమరుగైపోయింది. ముంబైలో `ఖిలాఫత్ హౌస్’ మాత్రం మిగిలింది. ( Qureshi, ibid, pp. 254-305).


ఖిలాఫత్ ఉద్యమం ప్రాముఖ్యత
ఖిలాఫత్ ఉద్యమం విఫలమైనప్పటికీ, అదెలాగూ తప్పేది కాదు, దానికున్న ప్రాముఖ్యత తక్కువేమీ కాదు. వహాబీ, ఫరైజీ వంటి ఇస్లామియా ఉద్యమాలు అంతకుముందు జరిగినప్పటికీ, ఒక కేంద్రీకృత సంస్థ నిర్దేశంలో, మొత్తం దేశమంతా జరిగిన భారత ముస్లిముల మొదటి ఆందోళన `ఖిలాఫత్ ఉద్యమం’ అని చెప్పవచ్చు. బొంబాయి, బెంగాల్, యు.పి. రాష్ట్రాలలో పాతుకుపోయిన ముస్లిం రాజకీయాలు ఎప్పటినుంచో ఉన్నా, వాటితోపాటు పంజాబ్, సింద్, సరిహద్దు రాష్ట్రాలలో కూడా ముస్లిం రాజకీయాలు తెరమీదకు వచ్చాయి.
    1857 తరువాత, ఉన్నత-మధ్యతరగతి ముస్లిం వర్గాలలోనే, ముస్లిం రాజకీయాలు ప్రధానంగా ఉండేవి. కాని ఇప్పుడు, పాశ్చాత్య దేశాలలో విద్యావంతులైన ఉన్నతవర్గాల ముస్లిం రాజకీయ నాయకులతో సమానంగా, వారితో పాటు `ఉలామా’ కూడా రాజకీయాలలో ముందు వరుసలో చేరారు. ఖిలాఫత్ ఉద్యమం సాధారణ ముస్లిం జనాభాను సమీకరించగలిగింది. ఈ రాజకీయ సమీకరణ ఎంత కట్టుదిట్టంగా సాగిందంటే, కాంగ్రెస్ పార్టీలో తన నాయకత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి, గాంధీగారికి ఇది చాలా ఉపకరించింది. తరువాత వచ్చిన ఇతర ఉద్యమాలకి, ఒక రకంగా, ఖిలాఫత్ స్ఫూర్తి అయింది. డా. కిత్చ్లూ 1923లో `తన్జీం’ అనే ఉద్యమం ప్రారంభించగా, దానిని 1924లో `సికెసి–కేంద్ర ఖిలాఫత్ కమిటి’ తమ సంస్థలో చేర్చుకుంది. డా.కిత్చ్లూ కాక, షౌకత్అలీ దీంట్లో ప్రముఖ నాయకుడు. ముస్లిం జీవనాన్ని, ముస్లిం సముదాయాన్ని ప్రభావితం చేసే ఒక నూతన బృహత్ కార్యక్రమం, జమాయత్-ఉల్-అలామా మరియు `సికెసి’ తరపున చేపడతామని డా. కిత్చ్లూ ప్రకటించారు. ఆ కార్యాచరణలో భాగంగా, ముస్లిం సముదాయాలు ఏర్పాటు చేయడం, మసీదుల్లో ప్రాథమిక పాఠశాలలు నడపడం, పాఠ్యపుస్తకాల తయారీ, మసీదుల్లో చదివే ‘ఖుత్బా’లు జారీ చేయడం, సమయపాలన, సాంకేతిక మరియు వ్యాపార కళాశాలల ఏర్పాటు, వక్ఫ్ బోర్డులపై ఆజమాయిషీ, `జకాత్’ సేకరణ, విధవలకి- అనాథలకి సహాయకాలు, ముస్లిం సహకార బ్యాంకులు, సంఘాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేయాలని వారి కోరిక.
     1919లో `జమాయత్-ఉల్-అలామా హింద్’ (భారత `దైవజనుల సంఘం’) స్థాపించబడింది. అయితే ఖిలాఫత్ నడుస్తున్న కారణంగా, పార్టీ రాజకీయాలు-ముస్లిం వర్గాల మధ్య గానీ, లేక హిందూ-ముస్లిమ్ల మధ్య గానీ- కొంతకాలం స్తబ్దంగా ఉండిపోయాయి. జమాయత్ అన్నిరకాల `ఉలామా’లకు కేంద్రంగా ఉండేది, తరువాతి కాలంలో ఇది ముస్లిం `దేవ్బంద్’ వర్గానికి, రాజకీయ అంగంగా మారింది.


 గాంధీగారికి ఖిలాఫత్-వాదులకి మధ్య పరస్పర అవగాహన, ఖిలాఫత్ ఉద్యమానికి హిందూ-ముస్లిం ఐక్యత అనే ఆచ్చాదన కల్పించింది. ఈ ఉద్యమం- దేశ స్వరాజ్య పోరాటమనే భ్రమ హిందువులకి కల్పించగలిగారు, ఈ రోజుకి చాలామంది ఇదే భ్రమలో ఉన్నారు. స్వరాజ్య సముపార్జనకి,  హిందూ-ముస్లిం ఐక్యత తప్పనిసరి అనే భావన హిందువుల మనసుల్లో బాగా రుద్దబడింది. అయితే ముస్లిములకు మాత్రం- కాంగ్రెస్ పార్టీతో సహకారం, హిందువులతో రాజకీయసహకార తోడ్పాటులు, విస్తృత ఇస్లామియా లక్ష్యానికే  అనే స్పష్టమైన అవగాహన ఉంది. అబ్దుల్ బారీ నవంబర్ 1920లో, “ఆయనతో (గాంధి) సహకార- సమన్వయం ఇస్లాంని  బలపరుస్తాయి” అని వ్రాసాడు. (Religion and Politics: The Ulama and Khilafat Movement,Mushirul Hasan,Economic and Political Weekly, Vol. 16, No. 20, 1981, p. 907). కాకినాడలో జరిగిన ఖిలాఫత్ సమావేశంలో షౌకత్అలీ, 27డిసెంబర్ 1923న మాట్లాడుతూ “స్వరాజ్య సాధన రాజకీయ జాతీయ విధియే కాక, ఇస్లామియా బాధ్యత కూడా” అన్నారు (Qureshi, ibid, p. 270). ఒక్కమాటలో చెప్పాలంటే, హిందువులు తమ హిందూత్వ నైజాన్ని, లక్షణాలని వదలేసి భారతీయులైతే, ముస్లిములు మాత్రం మొదటినుంచి చివరిదాకా ముస్లిముల్లాగే ప్రవర్తించారు!

ఖిలాఫత్ ఉద్యమం ముస్లిం రాజకీయాలలో, ఇంకొక అతి ముఖ్యమైన, చాలాకాలం నిలబడిపోయే ఫలితం సాధించింది- అది పాకిస్తాన్ కోసం పునాదులు వేయడం. “ఇస్లాం గురించి అత్యంత ప్రాధాన్యo ఇవ్వడంవల్ల, ముస్లిములలో ముస్లిం స్పృహ కలిగించింది. ఆ భావన వారిలో పాతదే అయినా, అంతకుముందు లేని విధంగా, ముస్లిం భావజాలాన్ని తీవ్రంగా నొక్కిచెప్పడంవల్ల, వారు ప్రధమంగా ముస్లిములు, తరువాతే భారతీయులు అనే భావన వారిలో నెలకొంది. ఇది ముస్లిం జాతీయవాదానికి పెద్ద విజయం, ఎందుకంటే ఇది తరువాత అనేకానేక ఇతర ఎకీకరణలు సాధ్యమయేలా చేసింది” (The Making of Pakistan: A Study in Nationalism, K.K. Aziz, Chatto and Windus, London, 1967, p.115).


పాఠం 1 – ఇస్లాం ప్రధమం, తర్వతే దేశం
ముస్లిం రాజకీయాలను, ముఖ్యంగా ఖిలాఫత్ ఉద్యమాన్ని పరిశీలిస్తే, ముస్లిం మనస్తత్వం-భావజాలం గురించి కొన్ని లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఖిలాఫత్ ఉద్యమ నేపధ్యoలో, ముస్లిం రాజకీయాల గురించి డా. ఆన్నీ బెసంట్ ఈ విధంగా అభిప్రాయపడ్డారు, “కత్తిని ఝుళిపించే పాత ఇస్లాం మతాన్ని, మళ్ళి రోజువారీ రాజకీయాలలో తిరిగి చొప్పించడం చూసాము. మరచిపోయిన శతాబ్దాలనాటి `ప్రత్యేకమైన’- ఇతరులను సహించని పాత మతాన్ని మళ్ళి గుర్తు చేసుకుని, ముస్లిమేతరులను అడుగుకూడా పెట్టనివ్వని పాత అరేబియాను `జజిరుత్-అల్-అరబ్’ ‘పవిత్రభూమి’ అని ప్రార్థన చేసుకుంటున్నారు. ఆఫ్ఘాన్లు భారత్ పై దాడి చేస్తే, భారత ముస్లింలు తమ ఆఫ్ఘాన్ ముస్లింమత సహోదరులతో జతకలిపి, మాతృభూమి తరపున విదేశీ శత్రువులతో పోరాడే హిందువులను ఊచకోత కోస్తామని, ఇక్కడి ముస్లిం నాయకులు ప్రకటించగా విన్నాము. ముస్లిముల ప్రథమ విధేయత ఇతర ఇస్లామియా దేశాలకే తప్ప, తమ సొంత మాతృభూమి పట్ల కాదనే సంగతి విన్నాము, బాధాకరమైన ఈ పరిస్థితిని చూడాల్సి వచ్చింది. వాళ్ళు జన్మించి నివసించే దేశం- ‘రాజ్యం’ చట్టాలకన్నా ఎక్కువగా వాళ్ళ మతప్రవక్త ఆజ్ఞ్యలను పాటించాలని ముస్లిం నాయకులు ఇప్పుడు ప్రకటిస్తున్నారు, ఇది పౌరచట్టాల ఉల్లంఘన మాత్రమేకాక, ‘రాజ్య’ సుస్థిరతను భంగపరుస్తుంది. దేశంలోకాక, దేశం బయటున్న శక్తులపట్ల వారి విధేయత ఉన్నందున, వారు చెడు పౌరులుగా తయారవుతారు. మౌలానా మహమ్మద్అలీ, షౌకత్అలీ వంటి ముఖ్య ముస్లిం నాయకుల అభిప్రాయాలను ముస్లిములు సమ్మతిస్తున్నపుడు, ఇతర పౌరులు వీరిని నమ్మలేరు. భారత్ స్వతంత్ర దేశమైనపుడు, ఏ ముస్లిం నాయకులైనా `మహమ్మద్ ప్రవక్త’ పేరు మీద సామాన్య ముస్లిము ప్రజలకు విజ్ఞ్యప్తులు చేసినపుడు, అజ్ఞానంలో ఉన్న సామాన్యులు ఆ నాయకులను అనుసరించినపుడు, ఈ ముస్లిం సముదాయం కారణంగా, దేశ స్వాతంత్రానికి, సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుంది” (The Future of Indian Politics, Annie Besant, Theosophical Publishing House, Adyar, 1922, pp. 301-303).

దేశకాల పరిస్థితులకు అతీతంగా ఉన్న ఈ `ప్రపంచ ఇస్లాం’ ,‘ఇస్లామిజం’ పరిణామం గురించి డా. అంబేద్కర్, “ఇస్లాం మతం- సామజిక మరియు మతపరమైన సంబంధిత సమీకరణల కారణంగా, దేశ సరిహద్దులను గుర్తించదు. ఇస్లామిజం విస్తృతికి ఇదే ఆధారం. భారత్ లోని ముస్లిములు ‘ముందు మేము ముస్లిములము, తరువాతే భారతీయులం’, అని చెప్పడానికి ఇదే కారణం. భారతదేశ పురోభివృద్ధికి అతి తక్కువగా దోహదపడే భారత ముస్లిములు, ఇతర ముస్లిం దేశాల విషయాలలో అత్యంత ఆసక్తితో, ఎన్నో ప్రయాసలుపడి, అలిసిపోయి నీరసపడుతుంటారు. వారి ఆలోచనలలో, భారత్ కంటే ముందు, మరింత ఎక్కువగా ఇతర ముస్లిమ్ దేశాలు ఉంటాయి” (Pakistan or the Partition of India, B.R. Ambedkar, Thacker and Company Limited, 1945, pp. 290, 291).


పాఠం 2 – వ్యూహాత్మక సంధి ఐక్యత కాదు
ముస్లిములు ముస్లిమేతర దేశవాసులతో కలిసికట్టుగా పనిచేయడాన్ని నిరోధించడం ఈ `ప్రపంచ ఇస్లాం’(pan Islam) సహజ గుణం.
     తమతోటి ముస్లిములకు వ్యతిరేకంగా వారు అసలు పనిచేయరు. 1924లో ఒక బెంగాలీ పత్రిక శ్రీ రవీంద్రనాథ్ టాగోర్ తో ఇంటర్వ్యూ జరిపింది, దీని నివేదికను `టైమ్స్ అఫ్ ఇండియా’ 18ఏప్రిల్ 1924తేదిన ప్రచురించింది, “కవిగారి అభిప్రాయoలో, ముస్లిములు వారి దేశభక్తిని, ఏ ఒక్క దేశానికి పరిమితం చేసుకోలేకపోవడం కారణంగా, హిందూ-ముస్లిం ఐక్యత నిరోధించబడుతోంది; `ఏదైనా ముస్లిం దేశం/మహమ్మదీయ శక్తులు భారత్ మీద దాడిచేస్తే, ఈ దేశ ముస్లిములు సాటి హిందువుల పక్కన నిలబడి, వారితో కలిసి మాతృభూమిని రక్షించుకుంటారా’ అని తాను ముస్లిములను అడగగా, ఎవరి వద్దనుంచి సంతృప్తికరమైన సమాధానం లభించలేదని కవిగారు అన్నారు. `ఎవరైనా, ఏ దేశం వాడైనా, ఒక ముస్లిం ఇంకొక ముస్లిముకి విరోధిగా నిలబడడానికి ఎట్టి పరిస్థితులలోనూ అనుమతి లేదు’ అని మహమ్మద్ అలీ లాంటి నాయకులు కూడా ప్రకటించారని తాను ఖచ్చితంగా చెప్పగలనని టాగోర్ అన్నారు” (B.R. Ambedkar, ibid, pp. 268,269).
    గాంధీగారి వంటి కాంగ్రెస్ నాయకులు హిందూ-ముస్లిం ఐక్యత గురించి ప్రకటిస్తే అది నిజమైపోతుందని అనుకునేవారు. హిందూ-ముస్లిం ఐక్యతలో ఏ సమస్య దాగిఉన్నా, జవహర్లాల్ నెహ్రు ఉద్దేశపూర్వకంగా గుడ్డిగా విస్మరించేవారు. అసలు భారతలో `ముస్లిం సమస్య’ లేదని, మతతత్త్వవాదం కేవలం ప్రచారమే తప్ప నిజం కాదని, దానివల్ల `కొంచెం కూడా కష్టం రాబోదని, `మరీ ఎక్కువగా లేనిపోనివన్నీ కల్పించబడ్డాయ’ని, ‘సామాన్య ప్రజలు దానివల్ల ఇబ్బంది పడరు’ అని నెహ్రు అభిప్రాయం.`సాంఘిక అంశాలు’ ముందుకు వచ్చినపుడు,`ఆ సమస్య ఎలాగైనా దానంతట అదే సమసిపోతుంది’ (K.K. Aziz, ibid, p. 187).   హిందువులకి డా. అంబేద్కర్ సలహా “…హిందూ-ముస్లిం ఐక్యత సాధన కోసం, నిజాయితీగా నిరంతరంగా అన్నిరకాల ప్రయత్నాలు ప్రయాసాలు జరిగాయి, ఇంకేమీ చేయడానికి మిగల్లేదు, ఒక వర్గం ఇంకొకరికి లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఆధారం లేని నిరర్ధక ఆశావాదం నిరాకరించి, నిజాన్ని ధైర్యంగా ఒప్పుకుంటూ, ఈ `హిందూ-ముస్లిం ఐక్యత’ ఒక ఎండమావి లాంటిదని, దీనిని ఇప్పటికైనా వదిలిపెట్టాలని ఎవరైనా అంటే, వారిని నిరాశావాది అనో లేక పరిణతిలేని ఆదర్శవాది అనో అనలేరు. ఐక్యత కోసం గతంలో వారు ఎన్ని ప్రయత్నాలు నిరంతరం చేసినా, ఎప్పుడూ విఫలమైన హిందువులు, ఇంకా అదే నిరర్ధకమైన దారిలో వెళ్లి `ఐక్యత’ అనే వృధా ప్రయాస పడతారో, లేక ఇంకొక రకంగా పరిష్కారం వెతుక్కుంటారో హిందువులే తేల్చుకోవాలి” (B.R. Ambedkar, ibid, pp. 307).
  ఖిలాఫత్ ఉద్యమంలో `హిందూ-ముస్లిం ఐక్యత’ అని పిలవబడే ఒక దశ కనిపించినా, అది వారి బలాన్ని పెంచుకునే ఒక అవసరంగా ఖిలాఫత్-వాదులు అనుకున్నారు. అది కేవలం ఒక వ్యూహాత్మక కూటమి తప్ప నిజమైన హృదయాల కలయిక కాదు. నిజానికి, `విశ్వాసుల’కి `అవిశ్వాసుల’తో ఐక్యత అనే ఊహే ఇస్లాంలో వెగటు కలిగించేది, భరించలేనిది.


పాఠం 3- ఇస్లాంలో మతం-రాజకీయాల లక్ష్యం ఒకటే
నిజానికి ఖిలాఫత్ ఉద్యమం అసలు స్వభావం మతపరమైనదా లేక రాజకీయమా? ఇది కేవలం నకిలీ ప్రశ్న, ఎందుకంటే ఇస్లామియా సిద్ధాంతాలలో ఈ రెండూ వేరువేరు కోవలకి చెందినవి కావు. ఇస్లాంలో మత మరియు లౌకిక సూత్రాలు పూర్తిగా గజిబిజిగా కలిసిపోయి, సామాజిక, పౌర, రాజకీయ జీవనాలు ఈ సూత్రాలతో నిర్దేశించబడతాయి.  సయ్యిద్ అబ్దుల్ అలా మౌదుడి (1903-1979) అనే ఆధునిక ఇస్లామియా సైద్ధాంతికకర్త ఇలా అంటారు, “ఇస్లాం కొన్ని సిద్ధాంతాలు, నమ్మకాలు, ఆచార వ్యవహారాల సమూహం మాత్రమే కాదు; వ్యక్తిగత మరియు సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, నైతిక, చట్ట, న్యాయ మొదలైన అన్ని విధాలుగా మనవ జీవనాన్ని సంపూర్ణంగా నిర్దేశించి నియంత్రించే మార్గదర్శకత్వాలు ఇస్లాంలో ఉన్నాయి. అన్ని మనవ కార్యకలాపాలు, పూర్తి జీవన విధానాలు ఇస్లాం నిర్దేశిస్తుంది. మతం మరియు రాజకీయాల మధ్య భేదం ఉందని ఇస్లాం అంగీకరించదు; ఇస్లాం ప్రకారం మతం మార్గదర్శకత్వంలో రాజకీయాలు నిర్వహించుకోవాలి, `ప్రభువు’కి సేవకుడిలా `రాజ్యం’ వ్యవహరించాలి. కురాన్ ప్రకారం, `అల్లా’ సర్వాధిపతి, న్యాయాధిపతి; `అల్లా’ వెల్లడించిన చట్టాలు ఆ రాజ్యంలో న్యాయశాసనాలు” (The Islamic Law and Constitution, Tr. Khurshid Ahmad, Islamic Publications Limited, Lahore, 1960, pp. 1-5). మతం ఇంటికే పరిమితం, బయటి ప్రపంచంలో లౌకిక రాజ్యాంగం వర్తిస్తుంది అని వాదించేవారికి ఇస్లాం అసలు అర్ధం కాలేదనే చెప్పాలి.


పాఠం 4 – `ప్రపంచ ఇస్లాం’(pan Islam) ఒక కల్పన
భారతీయ ఖిలాఫత్-వాదులకి టర్కిష్ ఖలిఫేట్ ఒక వ్యసనంగా తయారైంది. అయితే టర్కీ మాత్రం ఖలీఫాను గద్దెదింపి, గణతంత్రదేశం అయింది. `ప్రవక్త’ వంశానికి చెందిన మక్కా నగర షరీఫ్ కూడా టర్కిష్ ఖలీఫాకు ఎదురు తిరిగారు. ఓట్టోమాన్ టర్కిష్ సామ్రాజ్యంలోని ఆరబ్బులు స్వయం-పాలన కోరుకున్నారు. `ఇస్లామియా సామ్రాజ్యం’ అని కలలుకని వాటిని ఆఫ్ఘాన్ `ఆమిర్’(రాజు) సాకారం చేస్తాడని, భారతీయ ఖిలాఫత్-వాదులు/ముహాజిర్లు గుంపులుగా అఫ్ఘానిస్తాన్ వెళ్ళగా, ఆయన వాళ్ళను నిర్లక్ష్యంగా దగా చేసాడు. 1924లో `నెడ్జ్’ రాజ్యానికి రాజు, సౌదీ రాజవంశ స్థాపకుడు `ఇబ్న్ సౌద్’ ఇస్లాం పవిత్ర స్థలాలను తన నియంత్రణలోకి తీసుకుని, సామాన్య ముస్లిములు పవిత్రంగా భావించే సమాధులపైనుండే `గుమ్మటాలను’ తొలగింపచేసాడు. ఈ ధ్వంసంపై  భారతీయ ఖిలాఫత్-వాదులు రెండు గుంపులుగా విడిపోయి కొందరు సమర్థిస్తే, కొందరు ఖండించారు. ఈ సంఘటనలతో సరిహద్దులకి అతీతమైన `ప్రపంచ ఇస్లాం’ ఒక కల్పన అని  ఖిలాఫత్-వాదులకి అర్ధమైఉండాలి. కాని వాళ్ళు మాత్రం కేవలం గ్రంథాలలో చెప్పినదాన్ని పట్టుకుని వేళ్ళాడారు. చారిత్రకసత్యాల కన్నా గ్రంథాలే వారికి ముఖ్యం కాబట్టి, భవిష్యత్తులో కూడా ముస్లిములు `ప్రపంచ ఇస్లాం’ అనే కధనాన్ని తిరగదోడతారనడంలో సందేహం లేదు! అయితే నిజమైనా – కల్పనైనా, ఒక బృహత్-శత్రువు ఎదురైతే, ముస్లిము నాయకులు-జనం, తమ అంతఃకలహాలు మర్చిపోయి ఒకటౌతారు అనే విషయం గమనార్హం.


పాఠం 5- ముస్లిం ప్రవర్తనా-శైలి అంచనా వేయచ్చు
శాశ్వతమైన మతగ్రంథాలలోని ఇస్లామియా విశ్వాసాల ఆధారoగా ముస్లిం ప్రవర్తనా-శైలి నిర్ణయించబడుతుంది, కాబట్టి ఇది స్థల-కాలాలకి అతీతంగా ఉంటుంది. గ్రహింపు ఉన్నవారు ఈ ఇస్లామియా ప్రవర్తనా శైలిని అర్ధం చేసుకుని అంచనా వేయగలరు. ఉదాహరణకి- అభ్యర్ధన ఒప్పించడం, ఆ తరువాత బలప్రయోగం హింస విధ్వంసం సాధారణంగా పాటించే కార్యాచరణ. అట్లాగే, జిహాద్ లో జరిగే భయంకరమైన అత్యాచారాలు కూడా మార్పులేకుండా అవే. అటువంటప్పుడు  ప్రవర్తనా-శైలి అంచనా వేసి, దానిని తప్పించడం, నివారించడం లేక ఓడించడం అసాధ్యం కాదు. అయితే దీనికి ఇస్లాం మతవిశ్వాసాలను అధ్యయనం చేస్తే, ప్రవర్తనా-శైలిని అంచనా వేయచ్చు. అలా చేయకపోతే, ఇటువంటివన్నీ చెదురుమదురు సంఘటనలుగా భావించి, సరైన సముచితమైన సమాధానాలు చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఖిలాఫత్ ఉద్యమ కాలంలో, కొందర్ని మినహాయించి, మిగతా హిందూ నాయకులంతా ఇస్లాం మతవిశ్వాసాలను అర్ధం చేసుకుని, ఇతర హిందూ అనుచరులకు కార్యకర్తలకు వివరించడంలో విఫలమయారు. ఇప్పటికీ పరిస్థితిలో ఏమంత మార్పు రాలేదు! ఇప్పటికైనా ఖిలాఫత్ ఉద్యమం గురించి చదివేవాళ్ళు, ఇస్లాం మతవిశ్వాసాలను అర్ధంచేసుకుంటే, అప్పటి ఖిలాఫత్ హింసా దౌర్జన్యాలలో, క్రూరంగా చంపబడ్డ వేలాదిమంది ప్రాణాల బలిదానం వ్యర్ధమవలేదు అని భావించవచ్చు.

ఖిలాఫత్ ఉద్యమం జరిగి ఒక శతాబ్దం గడిచింది. ఆ హింసనుంచి పాఠాలు నేర్చుకోకపోతే, మనకి మనమే కోరి ముప్పు తెచ్చుకున్న వాళ్ళమవుతాము.

-సమాప్తం-

(రచయిత ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ – ఇస్లాం సంబంధాలు, శుద్ధి ఉద్యమం, మతపరమైన జనాభా మొదలైన అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసారు)

NOTE : “ఖిలాఫత్ ఉద్యమ అసలు చరిత్ర”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:


మూలము: విశ్వ సంవాద కేంద్రము - తెలంగాణ
{full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top